: ఖమ్మం జిల్లాలో గిరిజనులను అపహరించిన మావోయిస్టులు!
ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో మరోసారి మావోయిస్టులు కలకలం రేపారు. 13 మంది గిరిజనులను అపహరించారని తెలిసింది. అపహరణకు గురైనవారు వారు చింతూరు మండలం పేగకు చెందిన వారని అనుమానిస్తున్నారు. మావోలు నిన్న అర్థరాత్రి తరువాత అపహరణకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు తమకు వ్యతిరేకంగా, పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న కారణంతోనే మావోలు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరితో పాటు మరో పదకొండుమందిని కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే, వారిని ఏ ప్రాంతానికి తీసుకువెళ్లారన్నది మాత్రం తెలియరాలేదు. అటు, గిరిజనుల అపహరణను ఖమ్మం జిల్లా పోలీసులు ధ్రువీకరించలేదు. ఇటీవల ఖమ్మం జిల్లా సరిహద్దులో పలుమార్లు మావోల కలకలం రేగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.