: ఎయిర్ ఏషియా విమానం కోసం భారీ స్థాయిలో గాలింపు
ఆదివారం నాడు ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మిస్సింగ్ ప్లేన్ కోసం భారీ ఎత్తున గాలింపు కొనసాగుతోంది. 30 నౌకలు, 15 విమానాలు, 7 హెలికాప్టర్లు గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండోనేషియా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలు సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. నేడు జరిగే గాలింపు చర్యల్లో పాల్గొనేందుకు థాయ్ లాండ్ కూడా సిద్ధంగా ఉందని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ హెన్రీ బంబాంగ్ సొలిస్ట్యో తెలిపారు. విమానం కోసం గాలింపును భూభాగానికి కూడా విస్తరించనున్నట్టు చెప్పారు. అటు, అమెరికా నేవీ తన డిస్ట్రాయర్ (యుద్ధనౌక)ను ఈ ఆపరేషన్ కోసం పంపింది. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ డిస్ట్రాయర్ మంగళవారం కాస్త ఆలస్యంగా గాలింపు బృందాలతో కలవనుంది. విమానం కోసం వెదికేందుకు ఆసియా పెద్దన్న చైనా కూడా తన సంసిద్ధత వ్యక్తం చేసింది.