: ‘రాజధాని’ ప్రమాదం నిందితుల కోసం గాలింపు... పోలీసుల వైఖరిపై రైతుల ఆగ్రహం
నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని గ్రామాల్లో నిన్న చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి కారకులైన వారి కోసం పోలీసుల గాలింపు ముమ్మరమైంది. అగ్ని ప్రమాదానికి కారకులు మీరంటే, కాదు మీరేనంటూ అధికార, విపక్ష పార్టీలైన టీడీపీ, వైకాపాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ రంగు పులుముకున్న ఈ ప్రమాదంపై దర్యాప్తు పోలీసులకు కత్తిమీద సాములా మారింది. కరవమంటే కప్పకు... విడివమంటే పాముకు కోపమన్న చందంగా పోలీసుల పరిస్థితి తయారైంది. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు గతరాత్రి అనుమానితులుగా భావించిన కొంతమంది రైతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. దీంతో అసలు నిందితులను వదిలేసి తమను అర్ధరాత్రి స్టేషన్ కు పిలవడమేంటని రైతులు పోలీసులపై విరుచుకుపడ్డట్లు సమాచారం. ప్రమాద స్థలంలో కూలంకషంగా శోధించిన పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో పోలీసులు జాగిలాలను కూడా పిలిపించారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రైతులను విచారించేందుకు తాము పూనుకోవాల్సి వచ్చిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే తమకు సహకరించాల్సిన రైతులు తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇక దర్యాప్తు సాగేదెలాగంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిందితులెప్పుడు దొరుకుతారో, పోలీసులకెప్పుడు విశ్రాంతి లభిస్తుందో చూడాలి.