: తెరచుకోని విమానం టైర్లు... 447 మందిని రక్షించిన పైలట్
లండన్ నుంచి లాస్ వెగాస్ వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ జంబో జెట్ విమానం ల్యాండింగ్ గేర్ లో సమస్య ఉన్నట్టు కనుగొన్న పైలట్ చాకచక్యంగా వ్యవహరించి 447 మందిని కాపాడి హీరోగా నిలిచారు. ల్యాండింగ్ గేర్ వేస్తే తెరచుకోవాల్సిన నాలుగు టైర్ బాక్సులలో మూడే తెరచుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ యూకేలోని గాట్విక్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దింపాడు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ప్రయాణిలకుందరూ ఊపిరి బిగపట్టి భయంతో వణికిపోయారు. ఈ దృశ్యాలను ఒక ప్రయాణికుడు చిత్రీకరించారు. ఇప్పుడా దృశ్యాలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. టేకాఫ్ అయిన నాలుగు గంటల ప్రయాణం తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించినట్టు వర్జిన్ అధికారులు వెల్లడించారు. విమానం దిగేటప్పుడు ఒకవైపు కొంత ఒరిగి పక్కకు జారుతున్నట్టు కనిపించింది. ఆ సమయంలో విమానం వెళ్తున్న దిశను పైలట్ కాస్త మార్చినట్టు తెలుస్తోంది. అలా చేయకుంటే విమానం కుడివైపు ఒరిగి పెను ప్రమాదం జరిగేదని సమాచారం. పైలెట్ నైపుణ్యం కారణంగా ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.