: నేడు టీఆర్ఎస్ లోకి నల్లగొండ జడ్పీ చైర్మన్... జడ్పీలన్నీ గులాబీ ఖాతాలోనే!
నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్ నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్ లుగా టీఆర్ఎస్ నేతలే కొనసాగనున్నారు. కాంగ్రెస్ కు చెందిన బాలూ నాయక్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బాలూ నాయక్ వెంట పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఆరు జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టులను టీఆర్ఎస్ దక్కించుకుంది. నల్లగొండ జడ్పీ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఖమ్మం జడ్పీని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోవడంతో ఆయనతో పాటు ఆ జిల్లా జడ్పీ చైర్మన్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్ కూడా టీఆర్ఎస్ లో చేరుతుండటంతో రాష్ట్రంలోని అన్ని జడ్పీలు అధికార పార్టీ నేతల అధీనంలోకే వచ్చినట్లవుతుంది.