: రవాణా శాఖ ఆదాయం ఏపీలో 20 శాతం పెరిగితే... హైదరాబాదులో 10 శాతం తగ్గింది
రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం క్రమేపీ పెరుగుతోంది. గత ఏడాది, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు... ప్రస్తుత ఏపీలోని 13 జిల్లాల రవాణా శాఖ ఆదాయం రూ. 1000 కోట్లుగా ఉండగా... ప్రస్తుతం అది రూ. 1200 కోట్లకు పెరిగింది. అంటే, 20 శాతం పెరిగిందన్న మాట. ఇదే సమయంలో హైదరాబాదులో రవాణా శాఖ ఆదాయం 10 శాతం పడిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో భూముల రేట్లు పెరగడంతో, ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గత 6 నెలల కాలంలో ఏకంగా కొత్తగా 72 ఆటోమొబైల్ షోరూంలు ఏర్పాటయ్యాయి. వీటిలో 25 షోరూంలు కార్లవే. గతంలో సీమాంధ్రవాసులు లగ్జరీ కార్లను హైదరాబాదులో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఏపీలోనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక చోట కారు కొని మరొకచోటికి తరలించాలంటే 4 శాతం ఎంట్రీ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో, కార్ల అమ్మకాలు ఏపీలో పుంజుకున్నాయి.