: 'హెపటైటిస్ బి'పై అమితాబ్ సమరభేరి
ప్రాణాంతక వ్యాధుల్లో 'హెపటైటిస్ బి' ఒకటి. ఇది సోకితే కాలేయం దెబ్బతింటుంది. తద్వారా మరణం సంభవిస్తుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఈ వ్యాధి పీడితులు ఎక్కువగా ఉన్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికలు చెబుతున్నాయి. తాజాగా, ఈ వ్యాధిపై ప్రచారం చేసేందుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (72) నడుం బిగించారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. "హెపటైటిస్ బి గురించి అవగాహన కలిగించేందుకు ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని అనుకుంటున్నా. దీనిపై కొందరు నిబద్ధులైన డాక్టర్లతో చర్చించాను" అని తెలిపారు. సామాజిక రుగ్మతలు, ప్రమాదకర వ్యాధులకు వ్యతిరేకంగా తన స్టార్ డమ్ ను వినియోగించేందుకు 'బిగ్ బి' ఎప్పుడూ ముందుంటారు. 2005 నుంచి ఆయన యునిసెఫ్ పోలియో నిర్మూలన కార్యక్రమానికి గ్లోబల్ అంబాసడార్ గా వ్యవహరిస్తున్నారు.