: పెట్టుబడి ఐఎస్ఐ పెట్టింది...'పీకే'సినిమాపై తీవ్ర ఆరోపణ!
తాజా పరిణామాలు చూస్తుంటే... పలు మతాలకు చెందిన వారంతా 'పీకే' సినిమాను ఎలాగైనా ఆపేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది! ఇప్పటికే పలు ముస్లిం సంఘాలు, భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల నుంచి చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని చోట్ల థియేటర్లు ధ్వంసమయ్యాయి కూడా. తాజాగా, 'పీకే' సినిమా నిర్మాణానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పెట్టుబడి పెట్టిందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. 'పీకే' సినిమా నిర్మించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, 'పీకే' సినిమాను విధువినోద్ చోప్రా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, రాజ్ కుమార్ హిరానీ నిర్మించారు. 'పీకే' సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లు లేవని సెన్సార్ బోర్డు స్పష్టం చేయగా, సినిమా చూడడం ఇష్టం లేకుంటే మానేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇంతకుముందే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా, 'పీకే' సినిమాను అద్భుతంగా నడిపారని, మనుషుల నమ్మకాలకు హేతుబద్దత ఉండాలనే దిశగా సినిమా నడిచిందని సినీ విమర్శకులు కూడా అభినందిస్తున్నారు. అయితే, నానాటికీ 'పీకే' సినిమాపై వివాదం ముదురుతుండడం ఆందోళన కలిగించే అంశమే.