: ఓడిపోయాం... మమ్మల్నెలా చేర్చుకుంటారు?: బొత్స
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పతనం దిశగా సాగుతోంది. ఉన్న సీనియర్ నేతలు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీ ప్రతిష్ఠ పెరగడం మాట దేవుడెరుగు, నానాటికీ దిగజారిపోతోంది. పార్టీ కేడర్ కనుచూపు మేరలో కనపడడం లేదు. దీంతో, కాంగ్రెస్ నేతలంతా టీడీపీ, బీజేపీ వైపు చూస్తున్నారు. గత కొంతకాలంగా పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై ఆయనను ప్రశ్నించగా, ఎన్నికల్లో ఓడిపోయిన తమను ఎవరైనా ఆహ్వానిస్తారా? అని ఎదురు ప్రశ్నవేశారు. గత రాత్రి గుంటూరు జిల్లాలో పంటపొలాలను అగ్నికి ఆహుతి చేయడం దుశ్చర్య అని అన్నారు. దీనికి బాధ్యులెవరన్నది తక్షణం ప్రభుత్వం బయటపెట్టాలని, లేని పక్షంలో రైతులు భూములిచ్చేందుకు నిరాకరిస్తుండడంతో ప్రభుత్వమే ఈ దుశ్చర్యకు పాల్పడిందని భావించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.