: సోనియా అల్లుడు వాద్రా దోషే: తేల్చేసిన హర్యానా ఉన్నతాధికారుల కమిటీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై చర్యలు తీసుకునేదాకా హర్యానా సర్కారు నిద్రపోయేలా లేదు. స్కై లైట్ హాస్పిటాలిటీ పేరిట రాష్ట్రంలో ఆయన చేజిక్కించుకున్న భూముల వ్యవహారంపై ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ)ల నేతృత్వంలోని ఇద్దరు ఉన్నతాధికారుల కమిటీ వాద్రాను దోషిగా తేల్చింది. హర్యానా ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక కుటుంబం అత్యధికంగా 53.8 ఎకరాలు కలిగి ఉండవచ్చు. అయితే వాద్రా కుటుంబం ఆధ్వర్యంలోని స్కై లైట్ హాస్పిటాలిటీ 79 ఎకరాలను కలిగి ఉంది. దీంతో వాద్రా నిబంధనలను అతిక్రమించారని సదరు కమిటీ తేల్చింది. అంతేకాక గతంలో వాద్రాకు క్లీన్ చిట్ ఇచ్చిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయాన్ని కూడా తాజా కమిటీ తప్పుబట్టింది. ‘‘ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం పరిశీలించినా, వాద్రా ఏ మూలనా నిర్దోషిగా కనిపించరు. మరి అలాంటప్పుడు ఆయనకు క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు?’’ అని కూడా తాజా కమిటీ తన నివేదికలో ప్రశ్నించింది. తాజా కమిటీ నివేదిక నేపథ్యంలో వాద్రాపై చర్యలకు ఖట్టర్ సర్కారు సన్నాహాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ కేసులో వాద్రాకు కనీసం రెండేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయంటూ గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.