: కోడి పందాలకు చురుగ్గా ఏర్పాట్లు... చుక్కల్లో పుంజుల ధరలు!
సంక్రాంతి సీజన్లో సంప్రదాయ కోడిపందాల నిర్వహణకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ ఏడాది పందాల్లో గెలుపు పుంజులవుతాయని భావిస్తున్న కొన్ని రకాల కోళ్ళకు లక్షల రూపాయల ధర పలుకుతోంది. ఏటేటా పోలీసుల హెచ్చరికల నడుమ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు షరా మామూలుగా సాగిపోవడం తెలిసిందే. గత మూడేళ్లుగా పందాల్లో అధిక పోటీల్లో గెలిచిన ఆబ్రాస్, రసింగ, కాకి జాతి రకం పందెం పుంజులకు ఈ ఏడాది విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. వీటితోపాటు పింగళి, మైలా, నెమలి, డేగ, పర్లా, కక్కిరాయి తదితర రకాల కోడి పుంజులు సంక్రాంతి బరిలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, కొత్త ప్రజాప్రతినిధులు రావడం, రాష్ట్రం విడిపోవడంతో సంప్రదాయ కోడి పందాలకు అధికారిక అనుమతి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది.