: కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: విష్ణువర్ధన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికున్న బంధం అత్యంత బలీయమైనదని... ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని పీజీఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. కొద్ది రోజుల క్రితం కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో విష్ణుకు గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం విష్ణు బెయిల్ పై ఉన్నారు. గొడవ జరిగిన అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కేవలం వంశీ మాట మాత్రమే విన్నారని... తనకు కనీసం ఫోన్ చేసి ఏం జరిగిందన్న విషయం కనుక్కొని ఉంటే బాగుండేదని విష్ణు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ను విష్ణు కలిశారు. దీంతో, ఆయన టీఆర్ఎస్ లో చేరతారేమో అనే వదంతులు కూడా హల్ చల్ చేశాయి.