: 'పీకే'లో కొన్ని సీన్లపై ఏఐఎంపీఎల్బీ అభ్యంతరం
సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతున్న 'పీకే' చిత్రంలో కొన్ని సీన్లు మత విశ్వాసాలను గాయపరిచేలా ఉన్నాయని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. మత సామరస్యానికి భంగం కలగదని హామీ ఇస్తూ సెన్సార్ బోర్డు సదరు సన్నివేశాలను తొలగించాలని బోర్డు సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ ఫరంగి మహాలీ డిమాండ్ చేశారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, "'పీకే'లో కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఇతరుల మనోభావాలను గాయపరచడం కాదు" అని అన్నారు. మతవిశ్వాసాలను కించపరిచే సినిమాలో, ముస్లిం అయిన అమీర్ ఖాన్ నటించాడంటే సదరు అంశాన్ని మరోలా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.