: ప్రజలకు లాభం... ప్రభుత్వాలకు నష్టం!
ఒక వైపు పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయని ప్రజలు ఆనందపడుతుండగా, వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు బాధపడుతున్నాయి. పెట్రోల్ ధరలు ప్రస్తుతం ఉన్న రేట్లలోనే కొనసాగితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలూ రూ.3500 కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయి. ధరలు మరింతగా తగ్గితే ఆదాయ నష్టం పెరగనుంది. సుమారు రూ.2 వేల కోట్లను ఏపీ, రూ.1500 కోట్లను తెలంగాణ నష్టపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గడచిన జూన్ నెలాఖరు నుంచి పెట్రోల్ ధర తగ్గుతూ రాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.700 కోట్ల మేర ఆదాయం కోల్పోయాయి. జూన్ లో రూ.80.41గా ఉన్న పెట్రోల్ ధర ఆగస్టు నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడది రూ.67.02కు చేరిన సంగతి తెలిసిందే. ఈ ధరలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కలిసి ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో 70 శాతం వ్యాట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, ఆదాయం కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు.