: ఓ గోల్ఫర్ ఎదుగుదల వెనుక ద్రావిడ్!


బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్ వంటి ప్రతిభావంతులు తమకు ద్రావిడే స్ఫూర్తి అంటారు. క్రికెటర్లలో అంతటి మంచి పేరు సంపాదించుకున్న 'వాల్' ఓ యువ గోల్ఫర్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించడం విశేషం. ఆ గోల్ఫర్ పేరు ఎస్. చిక్కరంగప్ప (21). ఈ బెంగళూరు కుర్రాడు ఈ ఏడాది రోలెక్స్ ర్యాంకింగ్స్ లో అగ్రపీఠం అధిష్ఠించాడు. ఆసియన్ డెవలప్ మెంట్ టూర్ టైటిల్ నెగ్గడం ద్వారా అంతర్జాతీయ యవనికపై ఉనికిని చాటాడు. గత ఆరు నెలలుగా 'ద్రావిడ్ సర్' అందిస్తున్న సలహాలే తన కెరీర్ ఉన్నతికి కారణమని చిక్కరంగప్ప తెలిపాడు. ఆయనకు తాను వీరాభిమానినని, టెస్టు క్రికెట్ ను అమితంగా ఇష్టపడతానని తెలిపాడు. అయితే, తాను గోల్ఫ్ తో ప్రేమలో పడ్డానని వివరించాడు. ఓ గోల్ఫ్ కోర్స్ కు సమీపంలో నివసిస్తుండడంతో సహజంగానే ఆ క్రీడపై మోజు కలిగిందని చెప్పుకొచ్చాడు. 'గో స్పోర్ట్స్ ఫౌండేషన్' మెంటర్ షిప్ లో భాగంగా ద్రావిడ్ ఈ యువ వర్థమాన గోల్ఫర్ కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ద్రావిడ్ ఆ సంస్థకు ప్రచారకర్త కూడా. కాగా, ప్రస్తుతం ద్రావిడ్ భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్ తో బిజీగా ఉన్నాడని, వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తమకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నట్టు చిక్కరంగప్ప తెలిపాడు.

  • Loading...

More Telugu News