: రోడ్డుపై గుంతలో పడి దంపతులకు గాయాలు... వినూత్న నిరసన... పోలీసుల దాష్టీకం!
ద్విచక్ర వాహనంపై ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్న చందు, జ్యోతి దంపతులు హైదరాబాదు, బేగంపేట వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో పడ్డారు. తమ రెండేళ్ల కుమారుడు సహా వీరికి గాయాలయ్యాయి. అందరిలా వీరు ఆసుపత్రికి పోకుండా ఘటనా స్థలిలోనే వినూత్న నిరసన చేపట్టారు. గుంతకు వాహనాన్ని అడ్డుగా పెట్టి, తక్షణం దాన్ని పూడ్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా వారిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. యాక్సిడెంట్ అయిన తమను ఏం జరిగిందో అడగకుండానే కానిస్టేబుల్ దాడి చేశాడని జ్యోతి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత కూడా తన భర్తను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అడ్డు వెళ్లిన తనపై కూడా ప్రతాపం చూపారని జ్యోతి వాపోయారు. చందూ తాగి, పోలీసులతో ఘర్షణ పడినందుకే తాము అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతుండగా, తాము పబ్ కో, మరెక్కడికో వెళ్లలేదని, ఉయ్యాల ఫంక్షన్ కు వెళ్లి వస్తున్నామని జ్యోతి చెబుతుండటం గమనార్హం. మహిళను రాత్రిపూట స్టేషన్ లో ఉంచకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, జ్యోతిని నిర్బంధించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం తాము వెళ్ళమని చెప్పినా ఆమె ఇంటికి పోలేదని అంటున్నారు.