: 'లింగ' సినిమా చూస్తూ రజనీ అభిమాని మృతి
'లింగ' సినిమా చూస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని మరణించిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కోయంబత్తూరు చెట్టిపాళ్యం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (56) రజనీకాంత్ కు వీరాభిమాని. ఆయన గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతలో 'లింగ' సినిమా విడుదలైంది. దీంతో ఎలాగైనా 'లింగ' సినిమా చూడాలని అతను భావించాడు. ఆసుపత్రిలో వైద్యులు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో తన నరానికి పెట్టిన డ్రిప్ ట్యూబ్ అలాగే ఉంచుకుని మరీ సినిమా థియేటర్ కు వెళ్లాడు. దగ్గర్లోని సినిమా హాల్ కు వెళ్తే ఎవరైనా పట్టుకునే ప్రమాదం ఉందని ఊహించిన అతను ప్రభుత్వాసుపత్రికి కిలోమీటరు దూరంలోని రైల్వే స్టేషన్ కు సమీపంలోని సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం ప్రారంభించాడు. సినిమా పూర్తయిన తరువాత కూడా అతను లేవకపోవడంతో సినిమా థియేటర్ సిబ్బంది అనుమానంతో పరీక్షించి చూడగా, ఆయన అప్పటికే మరణించినట్టు గమనించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాజేంద్రన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.