: నేడు సాగర్ కు గవర్నర్ దంపతులు...తెలుగు రాష్ట్రాల పరిధిలో రెండు రోజుల విహారయాత్ర
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు నాగార్జునసాగర్ పర్యటనకు వెళ్లనున్నారు. సతీసమేతంగా సాగర్ వెళ్లనున్న ఆయన నేడు, రేపు సాగర్ పరిసర ప్రాంతాల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు తెలుగు రాష్ట్రాలు రెండింటిలోని ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ పరిధిలోని విజయవిహార్ లో గవర్నర్ దంపతులు బస చేస్తారు. తెలంగాణ పరిధిలోని శ్రీ పర్వతారామం, సాగర్ ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం, ఏపీ పరిధిలోని ఎత్తిపోతలను సందర్శిస్తారు. శనివారం బుద్ధవనం సందర్శనానంతరం శాంతిసిరి లాంచీలో నాగార్జున కొండకు వెళతారు. అక్కడ బ్యాటరీ వాహనం ఎక్కి మ్యూజియం, సింహళవిహార్, అశ్వమేథ యజ్ఞశాల, మహాస్థూపం, చైత్యాలు తదితర ప్రాంతాలను సందర్శిస్తారు.