: మహిళా జడ్జికి అదనపు కట్నం వేధింపులు... భర్త అరెస్ట్
సాక్షాత్తూ మహిళా జడ్జికే అదనపు కట్నం వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో, హైదరాబాద్ మియాపూర్ 16వ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి శ్రీదేవి తన భర్త జితేంద్రపై అనంతపురం నగర టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు జితేంద్రతోపాటు అతడి తల్లిదండ్రులు, చెల్లెలు, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. జితేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో నివాసముంటున్న జితేంద్ర వృత్తిరీత్యా కాంట్రాక్టర్. శ్రీదేవితో అతనికి 7 నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకే వారి మధ్య విభేదాలు తలెత్తాయని... అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు. అయితే, తన భార్య తండ్రి వెంకటేశ్వర్లు మరొక వ్యక్తితో కలసి మంగళవారం రాత్రి తన ఇంటికి వచ్చి దాడి చేసినట్టు జితేంద్ర కూడా టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆస్తినంతా అమ్ముకుని, తల్లిదండ్రులను వదిలి హైదరాబాద్ రావాలంటూ తన భార్య మానసికంగా హింస పెడుతోందని... ఆమె చెప్పినట్టు వినకపోవడంతోనే తనపై కేసు పెట్టారని జితేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, జడ్జిపై కేసు కావడంతో న్యాయమూర్తి అనుమతి కోసం అర్జీ పెట్టినట్టు సీఐ తెలిపారు.