: ఆ వీసీ సమక్షంలో పట్టాలందుకోలేం: బెంగాల్ గవర్నర్ కు విద్యార్థుల నిరసన
పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠికి బుధవారం విద్యార్థుల నుంచి ఊహించని నిరసన వ్యక్తమైంది. వేధింపుల కేసులో విద్యార్థులపై లాఠీ చార్జీ చేయించిన వైస్ చాన్సలర్ సమక్షంలో డిగ్రీ పట్టాలు అందుకోలేమని విద్యార్థులు గవర్నర్ ముఖం మీదే చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక, 'సరే మీ ఇష్టం' అంటూ గవర్నర్ కూడా ఒకింత అసహనానికి గురికావాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే... బుధవారం కోల్ కతాలోని జాదవ్ పూర్ వర్సిటీ 59వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ త్రిపాఠి హాజరయ్యారు. విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలను అందిస్తున్నారు. అయితే పట్టాను స్వీకరించేందుకు వచ్చిన గీతోశ్రీ సర్కార్ అనే విద్యార్థిని త్రిపాఠికి షాకిచ్చింది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వర్సిటీ వీసీ అభిజిత్ చక్రవర్తి సమక్షంలో పట్టాను అందుకోలేనని తేల్చిచెప్పింది. దీంతో గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారు. మరో విద్యార్థి ఏకంగా వేదిక మీదకు ప్లకార్డుతో వచ్చేశాడు. మరికొంత మంది విద్యార్థులు వీసీ, గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంయమనం పాటించాలన్న త్రిపాఠి విజ్ఞప్తిని విద్యార్థులు పట్టించుకోలేదు.