: చోరీకని వచ్చి, మందుకొట్టి నిద్రపోయి అడ్డంగా దొరికిన దొంగలు
వారు దొంగలు. చోరీకని వచ్చారు. వచ్చిన పని చక్కబెట్టుకున్నారు. అప్పటికే మందుకొట్టున్న వారు కాసేపు కునుకు తీసి వెళ్ళొచ్చులే అనుకున్నారో ఏమో... అక్కడే నిద్రపోయి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నై ఈసీఆర్ రోడ్డుకు చెందిన దొంగలు కార్తీక్ (24), కమలకన్నన్ (25)లు తాంబరం సమీపంలోని పేరుంబాక్కంలోని ఓ హార్డువేర్ షాపు తాళాలు పగులగొట్టారు. అనంతరం షాపులోని క్యాష్ బాక్స్ తెరచి నగదు, విలువైన వస్తువులతోపాటు ఖరీదైన పెయింటింగ్ డబ్బాలను మూటగట్టారు. అప్పటికే వారు పూటుగా తాగి ఉండటంతో గాఢ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న కొందరు దుకాణం తాళాలు పగులకొట్టి ఉండడాన్ని చూసి యజమానికి సమాచారం అందించారు. మంచి నిద్రలో ఉన్న దొంగలను లేపి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.