: నేడు సుపరిపాలన దినం...వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 25ను సుపరిపాలన దినంగా కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. గంగా నది ఒడ్డున ఉన్న అస్సీ ఘాట్ లో జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించనున్న మోదీ, మరోమారు నగరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్లి ప్రధాని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. వర్సిటీ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా విగ్రహానికి ఆయన నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన వారణాసి మహోత్సవాలను ప్రారంభించనున్నారు.