: ఓపక్క 'బాయ్ కాట్ పీకే'... మరోపక్క 'సపోర్ట్ పీకే': ట్విట్టర్లో హోరెత్తుతున్న నినాదాల పోరాటం


అమీర్ ఖాన్ ను గ్రహాంతర వాసిగా, మనుషుల మనస్తత్వాలు అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిగా ఆవిష్కరించిన 'పీకే' సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది. ప్రేక్షకులు సినిమాను అద్భుత రీతిలో ఆదరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు 'పీకే' 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదిలా ఉంచితే, 'పీకే' సినిమాలో శివుడ్ని చెడుగా చూపించారని ఆరోపిస్తూ హీరో అమీర్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, విధు వినోద్ చోప్రాపై హిందూ లీగల్ సెల్ కార్యదర్శి కేసు నమోదు చేశారు. హిందూ ఆచారాలను సినిమాలో కించపరచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. "భయపడే వాడే గుడికెళ్తాడు" వంటి వ్యాఖ్యలను ఫిర్యాదులో ప్రస్తావించారు. కాగా, సోషల్ మీడియాలో సినిమాపై పలు రకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి. సినిమా విడుదలై విజయం సాధించింది, అందర్నీ అలరిస్తోంది అంటూ కొందరు పేర్కొంటుండగా, సినిమాలో హిందూయిజాన్ని అవమానించారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో "బాయ్ కాట్ 'పీకే'" పేరుతో కొందరు ప్రచారం చేస్తుండగా, "వుయ్ సపోర్ట్ 'పీకే'" అంటూ మరో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో ఆసక్తికర పోరాటం జరుగుతోంది.

  • Loading...

More Telugu News