: సూర్యుడి అత్యంత శక్తిమంతమైన ఫొటో తీసిన 'న్యూస్టార్'
సూర్యుడికి సంబంధించిన అత్యంత శక్తిమంతమైన ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే (నూస్టార్) టెలిస్కోప్ తీసింది. ఇప్పటి వరకు సూర్యుడికి తీసిన ఫొటోల్లో అత్యంత శక్తిమంతమైనది ఇదేనని నాసా ప్రకటించింది. సూర్యుడి ఉపరితలం నుంచి అత్యంత శక్తిమంతమైన ఎక్స్ కిరణాలు వెలువడుతుండగా న్యూస్టార్ టెలిస్కోప్ ఈ ఫొటో తీసింది. సుదూర తీరాల్లోని నక్షత్రాలు, కృష్ణబిలాలను అధ్యయనం చేసేందుకు నాసా న్యూస్టార్ ను 2012లో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఈ టెలిస్కోపుతో పరిశోధనలు చేస్తున్న కాలిఫోర్నియా పరిశోధకుల బృందం దీనిని సూర్యుడి వైపు తిప్పారు. దీంతో గతంలో రానంత స్పష్టతతో సూర్యుడి ఫొటోలు వచ్చాయి. వీటి కారణంగా సూర్యుడి ఉపరితలం, సౌరజ్వాలలు, రేడియేషన్, ప్లాస్మాకణాల గురించి కొత్త విశేషాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సౌర జ్వాలలను సరైన సమయంలో తీస్తే దశాబ్దాల చిక్కుముడి కూడా విడిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.