: అందరూ 'చరిత్ర' సృష్టిస్తే, ఈయన 'మరో చరిత్ర' సృష్టించారు... దటీజ్ 'బాలచందర్'


జులై 9, 1930లో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ సాధారణ వ్యక్తి... దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలుమూలలా చాటుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చిన్నతనం నుంచి సినిమాలపై తనకున్న అమితమైన ప్రేమ... చివరకు అతడిని సినీ రంగంవైపే నడిపించింది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన మధ్యతరగతి సమాజం, అనుబంధాలు, ఈర్ష్యలు, బాధలు, కష్టాలు, సంతోషాలు,... ఇవే ఆయన సినిమాలకు మూలకథలు. వీటితోనే బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి, సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. ఆయనే కె.బాలచందర్ 'ది గ్రేట్'. సినీరంగంలో అగ్రతారలుగా వెలుగొందిన, వెలుగొందుతున్న ఎంతో మందికి బాలచందర్ సినీ జీవితాన్ని ప్రసాదించారు. ఆయన సినిమాలతో ప్రాణం పోసుకున్న ఎందరో నటులు, టెక్నీషియన్లు సినీ పరిశ్రమలో అగ్రపథంలో కొనసాగుతున్నారు. దాదాపు 45 ఏళ్ల పాటు సినీపరిశ్రమలో కొనసాగిన బాలచందర్... స్క్రీన్ రైటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1965లో తొలిసారిగా ఎంజీఆర్ నటించిన 'దైవతాయ్' సినిమాకి మాటలు రాసే అవకాశం బాలచందర్ కు దక్కింది. అనంతరం మరికొన్ని సినిమాలకు కూడా మాటలు రాసిన బాలచందర్ కు... అదే ఏడాది (1965) 'నీర్ కుమిళి' అనే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. ఆ తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే సందర్భమే రాలేదు. దాదాపు 100 సినిమాలకు దర్శకుడిగానో, నిర్మాతగానో, స్క్రీన్ రైటర్ గానో ఆయన సేవలందించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుని, అఖండమైన పేరు, ప్రఖ్యాతులను సొంతం చేసుకున్న బాలచందర్ ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. దక్షిణ తమిళనాడులోని తంజావూరు జిల్లాలో 'నన్నిళం' అనే గ్రామంలో... కైలాసం దండపాణి, సరస్వతి దంపతులకు ఆయన జన్మించారు. వస్త్రాలకు రంగులద్దడంలో ఆ గ్రామానికి అప్పట్లో మంచి పేరు ఉండేది. ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆయనకు సినిమాల పిచ్చి. 12వ ఏట నుంచే చిన్న చిన్న డ్రామాలు, నాటకాలు రాసేవారు. ఆ తర్వాత అన్నామలై యూనివర్శిటీలో జువాలజీ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేశారు. ఆ సమయంలో కూడా స్టేజ్ షోలు ఇచ్చేవారు. చదువు పూర్తయిన తర్వాత తిరువారూరులో బడిపంతులుగా పనిచేశారు. 1950లో అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగం రావడంలో చెన్నై వెళ్లారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాసిన బాలచందర్... 'యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్' అనే డ్రామా కంపెనీని ఏర్పాటు చేసి, పలు ప్రదర్శలు ఇచ్చారు. ఆయన కంపెనీలో ప్రముఖ నటులు షావుకారు జానకి, నగేష్, శ్రీకాంత్ లాంటి వారు కూడా ఉండేవారు. ఆ సందర్భంలోనే ఆయనకు తొలిసారిగా 'దైవతాయ్' సినిమాకి స్క్రీన్ రైటర్ గా అవకాశం వచ్చింది. బాలచందర్ సినీ రంగంలోకి అడుగుపెట్టే నాటికే... ఎంజీఆర్ లాంటి సూపర్ స్టార్లు వెండితెర మీద వెలుగుతున్నారు. అప్పటికే కథలన్నీ హీరోచుట్టూ తిరుగుతున్నాయి. అయితే, బాలచందర్ మాత్రం మహిళ చుట్టూ కథలు తిరిగేలా కొత్త పథంలో ముందుకు వెళ్లారు. మధ్య తరగతి జీవితాలనే కథలుగా మలుచుకున్నారు. అప్పట్లో ఉన్న ఆచారాలు, స్త్రీలపై ఉన్న కట్టుబాట్లు, స్త్రీలు ఎదుర్కొన్న బాధలు ఇవన్నీ ఆయన సినిమాల్లో మనకు కనపడతాయి. అంతులేని కథ, మరో చరిత్ర, ఆరంగేట్రం, సింధుభైరవి, ఇది కథ కాదు, రుద్రవీణ, అందమైన అనుభవం, బొమ్మా బొరుసా, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం... ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక్కటేమిటి... ఆయన తీసిన సినిమాలన్నీ అద్భుతం, అమోఘం, అసమానం. ఇవే సినిమాలను మరొకరు తీయగలరా? అనేంత గొప్పగా సినిమాలను నిర్మించారు బాలచందర్. మరో విషయం ఏమిటంటే, ఆయన సినిమాల్లోని హీరో ప్రత్యేకంగా కాకుండా... అందరిలా సామాన్యుడిలాగానే ఉంటాడు. భారతీయ సినిమా రంగానికి ఓ ఐకాన్ లాంటి రజనీకాంత్ ను వెలికితీసింది బాలచందరే. 'అపూర్వ రాగంగల్' సినిమాలో ఓ పాత్రకు సరిపోయే నటుడి కోసం మద్రాసు మొత్తం జల్లెడ పట్టారాయన. నల్లటి రూపం, చురుకైన కళ్లు గల వ్యక్తి బాలచందర్ కు అవసరం. చివరకు ఓ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో రజనీని బాలచందర్ క్యాచ్ చేశారు. శివాజీరావ్ గైక్వాడ్ ను రజనీకాంత్ గా మార్చి... సినీ పరిశ్రమను శాసిస్తున్న గొప్ప నటుడిని అందించారాయన. 1981లో 'ఏక్ దూజే కేలియే' సినిమాతో బాలచందర్ బాలీవుడ్ ఆరంగేట్రం చేశారు. తెలుగులో ఆయన నిర్మించిన 'మరో చరిత్ర'కు ప్రతిరూపమే ఏక్ దూజే కేలియే. ఈ సినిమా ద్వారానే కమల్ హాసన్, మాధవి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలు బాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఈ సినిమాకు ఆయన 'ఫిలిం ఫేర్' బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు. సినీకళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను కళైలామణి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్నార్ నేషనల్ అవార్డులు ఆయనను వరించాయి. సినీ పరిశ్రమలో ఎంతో మంది 'చరిత్ర'లు సృష్టిస్తే... బాలచందర్ మాత్రం 'మరో చరిత్ర' సృష్టించారు. మధ్యతరగతి ఆడపిల్లల అంతరంగాన్ని, సంఘర్షణను, ఆత్మవిశ్వాసాన్ని అత్యంత అద్భుతంగా మలచిన బాలచందర్... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అసాధారణ ప్రజ్ఞాశీలి... ఇక సెలవంటూ తనువు చాలించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచందర్ (84) చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 7.15 గంటలకు కన్నుమూశారు. ఆయన మరణంతో యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమ కన్నీటిపర్యంతం అయింది.

  • Loading...

More Telugu News