: బెజవాడలో బీజేపీ ఫ్లెక్సీలపై సున్నం... ఆందోళనకు దిగిన పార్టీ నేతలు


విజయవాడలో మరోమారు ఫ్లెక్సీల వివాదం నెలకొంది. మొన్నటికి మొన్న టీడీపీ, వైకాపాల మధ్య నడిచిన ఫ్లెక్సీల వివాదంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ రెండు పార్టీలు కాస్త సంయమనం పాటిస్తున్నా, ఈ దఫా నగరంలో వెలసిన బీజేపీ ఫ్లెక్సీలపై గుర్తు తెలియని వ్యక్తులు సున్నం పూతలు వేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. వాజ్ పేయికి భారతరత్న పురస్కారం అందనుందన్న వార్తల నేపథ్యంలో ఫ్లెక్సీల సంఖ్య పెరిగిపోయింది ఈ ఫ్లెక్సీల్లో వాజ్ పేయితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితర కీలక నేతల ఫొటోలున్నాయి. మంగళవారం రాత్రి వెలసిన ఈ ఫ్లెక్సీలపై బుధవారం ఉదయానికంతా సున్నం పూత పడింది. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, మునిసిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఫ్లెక్సీలపై సున్నం పూత వచ్చి చేరిందని ప్రాథమిక సమాచారం. మరోవైపు ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సమాచారం పార్టీ నేతలకు తెలిసింది.

  • Loading...

More Telugu News