: కాశ్మీర్ లో బీజేపీ విజయ సారథి తెలుగు తేజం రామ్ మాధవ్!


జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ మునుపెన్నడూ లేనంత ఎక్కువ సీట్లను సాధించింది. మిషన్ 44 ప్లస్ నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ 25 సీట్లను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ఓట్లను చేజిక్కించుకోవడంలో మాత్రం తొలి స్థానం దక్కించుకుంది. దీంతో భవిష్యత్తులో ఆ రాష్ట్రంలో బీజేపీ పాలనాపగ్గాలను చేపట్టడం దుస్సాధ్యమేమీ కాదని తేల్చిచెప్పింది. భారీ విజయం సిద్ధించడంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కీలక భూమిక పోషించారట. తెలుగు నేలకు చెందిన రామ్ మాధవ్, మొన్నటిదాకా ఆరెస్సెస్ లో కీలకంగా వ్యవహరించి ఇటీవలే బీజేపీలో చేరారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలను పార్టీ చీఫ్ అమిత్ షా, రామ్ మాధవ్ భుజస్కందాలపై పెట్టారు. దీంతో ఎన్నికలకు పక్కాగా ప్రణాళికలు రచించిన మాధవ్, రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ క్షేత్రస్థాయి నేతలతో రామ్ మాధవ్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. రాష్ట్రంలో మైనారిటీ వర్గానికి 40 శాతం సీట్లను కేటాయించడంలోనూ మాధవ్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మిషన్ 44 ప్లస్ సాకారం కాకున్నా, భవిష్యత్తులో కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎన్నికల ఫలితాల అనంతరం రామ్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News