: టీమిండియా క్రికెటర్ల కడుపు మాడ్చిన 'మిస్ ఇండియా'!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లలో కొందరు బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా శాకాహారం దొరక్క నానా అగచాట్లు పడ్డారు. ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి లంచ్ సమయంలో మైదానం వెలుపలకు వెళ్లి ఏదోలా కడుపు నింపుకున్నారని వార్తలు రావడం తెలిసిందే. వాళ్లకు ఆ దురవస్థ ఎందుకు కలిగిందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి భారత జట్టు బ్రిస్బేన్ లో టెస్టు ఆడుతున్న సమయంలో లంచ్ బాధ్యతలను స్థానికంగా పేరుగాంచిన భారతీయ వంటకాల రెస్టారెంట్ 'మిస్ ఇండియా'కు అప్పగించారు. అయితే, ఆ రోజు ఆహార పదార్ధాలను స్టేడియం వద్దకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి నిర్దేశిత సమయంలో రాకుండా, కాస్త ముందే వచ్చాడట. అప్పటికింకా చపాతీలు సిద్ధం కాకపోవడంతో అతను వెనుదిరిగాడు. దీంతో, గందరగోళం నెలకొందని, శాకాహార వంటకాలను అందించలేకపోయామని 'మిస్ ఇండియా' ఎగ్జిక్యూటివ్ మేనేజర్ రవి తెలిపారు. కాగా, ఆస్ట్రేలియా వ్యాప్తంగా 'మిస్ ఇండియా' పేరిట 30 రెస్టారెంట్లు ఉన్నాయని, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసీస్ వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తుంటాడని, మరెందరో క్రికెటర్లకు ఇది ఇష్టమైన రెస్టారెంట్ అని రవి పేర్కొన్నారు. ఇటీవలే ముగిసిన జి20 దేశాల సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తమ వంటకాలను రుచి చూశారని చెప్పారు.