: మమ్మల్ని దుర్భాషలాడిన వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలి: గోరంట్ల
అధికార పక్ష సభ్యులను దుర్భాషలాడిన వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా కొంతమంది తమను బూతులు తిట్టారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన చెప్పారు. అంతేగాకుండా, తమపైకి దూసుకొచ్చి పచ్చి రౌడీల్లా వ్యవహరించడమే కాకుండా, విమర్శలు కూడా చేస్తున్నారని అన్నారు. వారి పార్టీ అధినేత ఇచ్చే సంకేతాల ఆధారంగా సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు ఇదేమీ లోటస్ పాండ్ కార్యాలయమో, పులివెందుల నియోజకవర్గమో కాదని ఆయన అన్నారు.