: భూమా నాగిరెడ్డి ఓ రౌడీ... మమ్మల్ని దున్నపోతులంటున్నారు: కాల్వ శ్రీనివాసులు
శాసనసభ సమావేశాల్లో మాటల యుద్ధం జరిగింది. తమపై విపక్ష సభ్యులు అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రుణమాఫీపై జరిగిన చర్చ సందర్భంగా జగన్ ఆరోపణలు, అచ్చెన్నాయుడి ప్రతిస్పందన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా తమ సీట్ల వద్దకు వచ్చిన విపక్ష సభ్యులు తమను అసభ్య పదజాలంతో దూషించారని శ్రీనివాసులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన వైకాపా సభ్యుడు భూమా నాగిరెడ్డిని రౌడీగా అభివర్ణించారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో రౌడీయిజం చేసిన భూమా, అసెంబ్లీలోనూ రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల రౌడీ అయిన భూమా తమను దున్నపోతులంటూ దూషించారని ఆయన స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ‘‘మీ రౌడీయిజాన్ని బయట చూపించుకోండి. సభలో చూపించాలని చూస్తే సహించేది లేదు. ఖబడ్దార్’’అంటూ కాల్వ శ్రీనివాసులు ఆగ్రహంగా ఊగిపోయారు.