: దిశ మారినా లక్ష్యం తప్పని 'బుల్లెట్'
రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కగానే బులెట్ బయటకు దూసుకువస్తుంది. అయితే, బుల్లెట్ పై బయటి నుంచి ఏ మాత్రం ఒత్తిడి పడినా (గాలి బలంగా వీచినప్పుడు) అది గురి తప్పుతుంది. అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యంకాదు. దీంతో చాలా సందర్భాల్లో భద్రతా బలగాల బుల్లెట్లు వృధా అవుతుంటాయి. వాటికి చెక్ చెప్పేందుకు శాస్త్రవేత్తలు కొత్త బుల్లెట్ ను సిద్ధం చేశారు. ఈ బుల్లెట్ గాల్లో కూడా దిశను మార్చుకుంటుంది. దీనిని యూఎస్ బలగాలు విజయవంతంగా పరీక్షించాయి. దీనికి 'స్మార్ట్ బుల్లెట్' అని పేరు కూడా పెట్టేశారు. ఈ బుల్లెట్ ప్రత్యేకత ఏమిటంటే, గాల్లో దిశను మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించడం. ఇది గాలి బలంగా వీచే క్రమంలో కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుందని డీఏఆర్పీఏ (ద అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ) స్పష్టం చేసింది. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఈ బుల్లెట్ సత్తా చూపుతుందని వారు వివరించారు. ఇది విరివిగా అందుబాటులోకి వస్తే తీవ్రవాదులు దాక్కుని ఉన్నా వారిని మట్టుబెట్టడం పెద్ద కష్టం కాకపోదు.