: నిబంధనలంటూ నిధులు ఆపేస్తున్నారు: ఆశా ప్రతినిధి రమణమూర్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యసేవా పథకంలో రోజుకో రకంగా మార్పులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రతినిధి రమణమూర్తి ఆరోపించారు. విజయవాడలో జరిగిన ఆశా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిబంధనల పేరు చెప్పి నిధులు ఆపేస్తున్నారని అన్నారు. తాము ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఉద్యోగుల హెల్త్ స్కీంలో భాగంగా ఓపీ సేవలు అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. స్పెషాలిటీ ఆసుపత్రుల సమస్యలపై ఈ నెల 24న జరగనున్న సమావేశంలో అనుకూల నిర్ణయాలు వెలువడకుంటే తాము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.