: బాత్రూంలో దాక్కుని పోలీసులకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకున్న కొత్తకోడలు
అత్తింటి ఆరళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవవధువులు ఇంకా వరకట్నపిశాచం బారిన పడి ప్రాణభీతితో తల్లడిల్లుతున్నారు. వివరాల్లోకి వెలితే... కరీంనగర్ కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్ బజార్‌కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ కిచ్చి ఆగస్టు 15న పెళ్లి చేశారు. చంద్రశేఖర్ తండ్రి కొద్దికాలం క్రితమే మృతి చెందడంతో, తల్లి, భార్యతో కలిసి తాతాచారి కాలనీలో ఉంటున్నాడు. వివాహ సందర్భంగా అరుణ తల్లిదండ్రులు లక్ష రూపాయలతో పాటు కొంత బంగారాన్ని కట్నంగా సమర్పించుకున్నారు. పెళ్లి జరిగిన మొదటి రెండు నెలలపాటు అరుణను బాగానే చూసుకున్న చంద్రశేఖర్ తరువాత అతని అసలు స్వరూపం బయటపెట్టాడు. నిత్యం పీకల్దాక తాగి ఇంటికొచ్చేవాడు. అదే అదనుగా అతని తల్లి లక్ష్మి ఏదో ఒక రూపేణా కట్నం గురించి ఎత్తేది. దీంతో అతను భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. గత రాత్రి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ భార్యపై వేధింపులకు దిగాడు. అతనికి అత్త తోడవ్వడంతో గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. అనంతరం గదిలో నిర్బంధించి కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రాణ భయంతో భీతిల్లిన అరుణ బాత్రూంలోకి పరుగెత్తింది. వెళ్తూనే భర్త సెల్ తీసుకెళ్లింది. దాంతో పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో వారు గోపాల్ పురం పోలీసులను అప్రమత్తం చేసి, బాత్రూంలో దాక్కున్న అరుణను కాపాడారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరుణ భర్త చంద్రశేఖర్, అత్త లక్ష్మిలను అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించారు.