: గార్డును బంధించి... ఏటీఎం చోరీకి దోపిడీ దొంగల విఫలయత్నం
తెలుగు రాష్ట్రాల్లో దోపిడీదొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు బ్యాంకులు, ఏటీఎంలపై చోరీలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని సూర్యారావుపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంను దోచుకునే క్రమంలో అక్కడ కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగారు. సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టడమే కాక అతడిని తాళ్లతో బంధించి, అతడి కళ్లెదుటే ఏటీఎం చోరీకి యత్నించారు. అయితే వారి యత్నాలు ఫలించలేదు. దీంతో దొంగలు ఖాళీ చేతులతోనే తిరిగివెళ్లారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈ ఘటన నేటి ఉదయం నగరంలో కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డు నుంచి వివరాలు సేకరించి, దోపిడీ దొంగల కోసం గాలింపు చేపట్టారు.