: హిరానీ 'గ్రహాంతరవాసి'కి అమీర్ ఖాన్ ప్రాణం పోశాడు...'పీకే' రివ్యూ


'పీకే' సినిమాపై అంచనాలు అంతులేనివి. మిస్టర్ పర్ఫెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి సినిమా విడుదల వరకు అంతులేని ఉత్కంఠ. వివాదాలు రేగినా దర్శకుడు, నిర్మాత చూపిన నిబ్బరం ఈ సినిమాకు మరింత హైప్ ను తీసుకువచ్చింది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు చూద్దామా? అనే ఆత్రుత అభిమానుల్లో రేకెత్తింది. ప్రపంచ సినీ చరిత్రలో 'పీకే' ఓ అద్భుతమైన ప్రయోగం అనడానికి సందేహించక్కర్లేదు. ఇంత వరకు వచ్చిన సినిమాలలో గ్రహాంతర వాసులు భూమిని రక్షించడానికో... లేదా భూమిని నాశనం చేయడానికో వచ్చారు తప్ప, ప్రమాదవశాత్తూ వచ్చి భూమిపై జీవించిన దాఖలాలు లేవు. కానీ 'పీకే'లో జరిగిన అద్భుతమదే. గ్రహాంతర వాసికి భారతీయతను రంగరించాడు దర్శకుడు. కధలో ఒకట్రెండు పాయింట్లు గతంలో వచ్చిన 'ఆదిత్య 369', త్వరలో రానున్న 'గోపాలా గోపాలా' సినిమాలవి అనుకున్నా కథనం మాత్రం అద్భుతంగా సాగింది. గతంలో తను తీసిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్', 'త్రీ ఇడియట్స్', సినిమాల్లానే అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రాజ్ కుమార్ హిరానీ సినిమాను అద్భుతంగా నడిపించాడు. సినిమా కథలోకి వెళ్తే... గ్రహాంతరవాసి (అమీర్ ఖాన్) రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో దిగుతాడు. అలా దిగుతూనే తన వాహనానికి సంబంధించిన లాకెట్ పోగొట్టుకుంటాడు. దానిని వెతికి తన గ్రహానికి వెళ్లిపోయేందుకు చేసిన ప్రయత్నమే 'పీకే' సినిమా. దీనిని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అద్భుతమైన కథనంతో నడిపించాడు. భూమి మీద దిగిన గ్రహాంతర వాసి మనుషులను చూసి భాష, బట్టలేసుకోవడం అన్నీ నేర్చుకుంటాడు. కానీ మనిషిలోని కన్నింగ్ నెస్ మాత్రం నేర్చుకోడు. అప్పుడే పుట్టిన పసివాడిలా ప్రతిదాన్నీ ప్రశ్నించి తెలుసుకుంటాడు. తన లాకెట్ కోసం అందర్నీ అడుగుతుండడంతో అందరూ అతనిని తాగేసి వచ్చావా? ('పీకే' హై, క్యా?) అని అడుగుతారు. దీంతో 'పీకే'గా స్థిరపడిపోయింది. చివరకు అతని లాకెట్ దేవుడే తెచ్చి ఇవ్వాలని అనడంతో దేవుడు మిస్సింగ్ అంటూ కరపత్రాలు పంచుతాడు. దీనిని చూసిన జర్నలిస్టు జగ్గూ (అనుష్క శర్మ) అతనిని గమనిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి దేవుడి పేరిట జరిగే వాటిపై పలు ప్రశ్నలు సంధిస్తూ సినిమా సాగుతుంది. ఎట్టకేలకు లాకెట్ సంపాదించడంతో సినిమా సమాప్తమవుతుంది. సినిమా కధ ఒక ఎత్తైతే, 'పీకే' పాత్రకు అమీర్ ఖాన్ ప్రాణం పోసిన విధానం అద్భుతమని చెప్పవచ్చు. ఇక సంజయ్ దత్, సౌరభ్ శుక్లా, అనుష్క శర్మల నటన బోనస్ గా భావించవచ్చు. భారతీయ సినిమా అంటే సమాజంలోని అసమానతల్ని ఎత్తి చూపుతూ, ఓ చక్కని సందేశమిచ్చే మీడియంగా వినుతికెక్కింది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు అందుకు పూర్తి విరుద్ధమైన పంథాలో పయనించగా, సినిమా గమ్యాన్ని మరోసారి పీకే నిర్ధారించింది. సినిమా చూసిన తరువాత ఇందులో ఇద్దరు హీరోలున్నారని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అమీర్ ఒకరైతే, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మరోహీరో!

  • Loading...

More Telugu News