: ఆ రెండు పార్టీలను పట్టించుకోవద్దు: విజయకాంత్
డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలపై మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని, అభివృద్ధికి ప్రతిబంధకంలా మారాయని ఆరోపించారు. ఆ పార్టీలను ప్రజలు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. మధురైలో ఓ ప్రదర్శన సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తనపై అక్రమ కేసులు బనాయించిన వారిపై పోరాడే సత్తా తనకుందన్నారు. వారి బెదిరింపులకు భయపడబోనని తెలిపారు. అంతేగాకుండా, అవినీతిపై నోరు మూసుకుని ఉండలేనని విజయకాంత్ ఉద్ఘాటించారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని సర్కారు ప్రజల కోసం ఏమీ చేయడం లేదని దుయ్యబట్టారు. ఆ పార్టీ నేతలు అవినీతికి పాల్పడిన వారి నేత (జయలలిత) కోసం దేవాలయాలకు వెళ్లి ఎందుకు ప్రార్థిస్తున్నారు? అని విజయకాంత్ ప్రశ్నించారు.