: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా... రెండో ఇన్నింగ్స్ లో 115/5
బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71/1 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాను జాన్సన్ (3 వికెట్లు) వణికించాడు. నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా టాపార్డర్ కు పరీక్ష పెట్టాడు. జాన్సన్ ధాటికి కోహ్లీ (1), రహానే (10), రోహిత్ శర్మ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ ధోనీ (0) తీవ్రంగా నిరాశపరిచాడు. హేజిల్ ఉడ్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో, భారత జట్టు 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం, క్రీజులోకొచ్చిన పుజారా (30), అశ్విన్ (15) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం భారత్ స్కోరు 5 వికెట్లకు 115 పరుగులు. భారత్ ఓవరాల్ ఆధిక్యం 18 పరుగులు. ఈ నేపథ్యంలో, లోయరార్డర్ బ్యాట్స్ మెన్ విశేషంగా రాణిస్తే తప్ప ఈ మ్యాచ్ లో భారత్ గట్టెక్కే అవకాశాల్లేవు. కాగా, ఓపెనర్ శిఖర్ ధావన్ (26) నాలుగోరోజు ఆటలో బరిలో దిగలేదు. ధావన్ నెట్స్ లో గాయపడి ఉండొచ్చని క్రికెట్ పండితులు అంటున్నారు.