: ఉద్ధవ్ థాకరే భద్రతాధికారిపై శివసేన ఎమ్మెల్యే దాడి... అనంతరం పరారీ


అదేంటీ, తన పార్టీ చీఫ్ కు భద్రత కల్పిస్తున్న అధికారిపైనే దాడి చేయాల్సిన అవసరం శివసేన నేత, మహారాష్ట్రలోని కన్నద్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ కు ఎందుకొచ్చిందనేగా మీ అనుమానం. కారణముంది. మంత్రులతో భేటీలో ఉన్న అధినేతను కలుసుకునేందుకు వచ్చిన తనను ఆ భద్రతాధికారి అనుమతించలేదు మరి. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో చేరిన తమ పార్టీ నేతలతో ఉద్ధవ్ థాకరే బుధవారం భేటీ అయ్యారు. ఆ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎవరినీ అనుమతించవద్దని స్వయంగా థాకరేనే పోలీసులకు చెప్పి మరీ వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జాదవ్, తాను శాసనసభ్యుడినని, లోపలికి అనుమతించాల్సిందేనని పట్టుబట్టాడు. అయితే థాకరే ఆదేశాలతో తమరిని లోపలికి అనుమతించలేమని థాకరే వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని ఇన్ స్పెక్టర్ పరాగ్ జాదవ్ తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఇన్ స్పెక్టర్ పై దాడి చేశారు. అనంతరం పరుగు లంఘించుకున్నారు. మరి సొంత పార్టీ అధినేత భద్రత సిబ్బందిపై దాడి చేసి అక్కడే ఉండగలడా? తీరా భేటీ తర్వాత ఇన్ స్పెక్టర్ నుంచి ఫిర్యాదునందుకున్న థాకరే, జాదవ్ కోసం ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. దీంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండని ఆయన పోలీసులకు చెప్పేశారు. దీంతో జాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. అయితే జాదవ్ కు ఇదేమీ కొత్త కాదట. గతంలో ఎంఎన్ఎస్ లో ఉన్నప్పుడూ ఏకంగా నాటి సీఎం చవాన్ సెక్యూరిటీ సిబ్బందిపైనే దాడి చేశాడట. నాడు అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు థర్డ్ డిగ్రీని కూడా జాదవ్ కు రుచి చూపించారట.

  • Loading...

More Telugu News