: కామన్వెల్త్ రెజ్లింగ్ రజత విజేత గీతికపై దాడి
ప్రాక్టీసు చేస్తుండగా ఓ వ్యక్తి తనపై దాడికి పాల్పడ్డాడంటూ భారత మహిళా రెజ్లర్ గీతికా జఖార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల 63 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో గీతిక రజతం గెలుచుకుంది. కాగా, హర్యానాలోని హిసార్ లో ఆమె తోటి రెజ్లర్లతో కలిసి ప్రాక్టీసు చేస్తుండగా, సునీల్ అనే వ్యక్తి అక్కడికొచ్చాడు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయసాగాడు. అలా వ్యాఖ్యానించడం సరికాదంటూ గీతిక చెప్పడంతో అతను దాడికి దిగాడు. అంతేగాకుండా, చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి సునీల్ పరారయ్యాడు. గీతిక నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు.