: ఔషధాలు వికటించాయా?... ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయండి!
కాలం చెల్లిన ఔషధాలు వాడితే దుష్ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని ఔషధాలు ప్రత్యేక పరిస్థితుల్లో వికటిస్తాయి. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టింది. ఔషధాల ప్రతికూల ప్రభావంపై 18001803024 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని అడ్వెర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సెంటర్లు పరిశీలించి జాతీయ సమన్వయ కేంద్రానికి పంపుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈ పరిశీలన ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలతోనూ, ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ పంచుకుంటుంది. కాగా, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను మెడికల్ షాపులు, క్లినిక్ లు, ఆసుపత్రుల్లో తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది.