: నేనో సైనికుడిని... పశ్చాత్తాపపడట్లేదు: ఐఎస్ ట్విట్టర్ ఉగ్రవాది
ఇరాక్, సిరియాల్లో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులకు అనుంబంధంగా ట్విట్టర్ అకౌంట్ ను నడుపుతూ పట్టుబడ్డ మెహదీ మస్రూర్ బిశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానో సైనికుడినని, తాను చేసిన పనికి ఎంతమాత్రం పశ్చాత్తాపపడటం లేదని రకటించాడు. గురువారం బెంగళూరు పోలీసులు అతడిని కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా, ఇలా ఎందుకు చేశావంటూ తనను ప్రశ్నించిన ఓ న్యాయవాదితో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేనో సైనికుడిని. మెసెంజర్ ను కూడా. నేను చేసిన పనికి ఎంతమాత్రం పశ్చాత్తాపపడటం లేదు’’ అని అతడు అన్నాడు. ఐఎస్ కు అనుకూల ట్విట్టర్ అకౌంట్ ను నడుపుతున్న అతడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బహుళ జాతి సంస్థలో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న అతడు ఐఎస్ కు అనుకూలంగా ‘షమీ విట్ నెస్’ పేరిట ట్విట్టర్ ఖాతాను నడిపాడు. ఐఎస్ తీవ్రవాదుల్లో ఆంగ్లం వచ్చిన వారితో సంబంధాలు నెరపడమే కాక అరబిక్ లోని పలు సందేశాలను అనువదిస్తూ ఉగ్రవాదులకు సహకరించాడు.