: పిల్లలతో పైశాచిక ఆటలు... ఉగ్ర దాడిని కళ్ళకు కట్టిన చిన్నారి
పాకిస్తాన్ లోని ఆర్మీ స్కూల్ పై దాడి చేసిన ఉగ్రవాదులు విద్యార్థులతో పైశాచిక ఆటలు ఆడుతూ, తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. వారి శాడిజాన్ని 14 ఏళ్ల షానవాజ్ ఖాన్ కళ్ళకు కట్టినట్టు వివరించాడు. రెండు బులెట్ లు తగిలి, గాయాలతో పెషావర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షానవాజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ, "మాకు ఇంగ్లీష్ గ్రామర్ క్లాసు జరుగుతోంది. క్లాసు మధ్యలో తుపాకి శబ్దాలు వినిపించాయి. పక్క గదిలో ఫస్ట్-ఎయిడ్ క్లాసు జరుగుతుండటంతో, ప్రదర్శనలో భాగంగా శబ్దాలు వస్తున్నాయని టీచర్ చెప్పారు. ఆ వెంటనే మరింతగా తుపాకి శబ్దాలు, విద్యార్థుల ఆక్రందనలు వినిపించాయి. మా టీచర్ బయటకు వెళ్లి ఆ వెంటనే పరుగున వచ్చి అందరినీ బెంచీల కింద దాక్కోవాలని సూచించారు. తలుపులు మూసివేసేందుకు ప్రయత్నించగా, ఆర్మీ దుస్తుల్లో ఏకే-47 గన్నులతో ఉన్న ఇద్దరు లోపలికి ప్రవేశించారు. నిశ్శబ్దంగా ఉండాలని తాము చెప్పినట్టు చేయాలని చెప్పారు" అని నాటి ఘటనను షానవాజ్ వివరించాడు. "ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలని అనుకుంటున్న ఎనిమిది మంది చేతులు ఎత్తండి' అని అడిగారు. మొత్తం పిల్లలు చేతులు ఎత్తారు. ఎనిమిది మందిని వాళ్ళే ఎంపిక చేసి బ్లాక్ బోర్డు వైపు వరుసగా నిలబెట్టారు. 'నీ ప్రియతములు చనిపోతుంటే నువ్వు చూడు. మా వాళ్ళను కూడా ఇలాగే చంపారు' అని టీచర్ కు చెప్పి విద్యార్థుల తలలపై కాల్చారు. కొంతమంది చనిపోగా, ఇంకొందరు రక్తపు మడుగులో బాధతో రోదిస్తూ ప్రాణాలు వదిలారు. ఆ తరువాత 'మాకు ఇంకో ఎనిమిది మంది కావాలి. ఎవరు ముందు చస్తారో చేతులు ఎత్తండి' అని వారిలో ఒకరు అన్నారు. ఎవరూ చేతులు ఎత్తలేదు. అందరం ఒకరి చేతులు ఒకరం పట్టుకొని వారిని ప్రతిఘటించాం. సైన్యం చుట్టుముడుతున్న శబ్దాలు విని, ఒక్కసారిగా పిల్లలందరి పైనా బులెట్ల వర్షం కురిపించారు. నా టై తీసి రక్తం ఎక్కువ కారకుండా కట్టు కట్టుకున్నాను. ఆ తరువాత స్పృహ కోల్పోయా" అని షానవాజ్ తెలిపాడు.