: పెషావర్ ఘటనను ఖండించిన ఏపీ అసెంబ్లీ
పాకిస్థానీ నగరం పెషావర్ లోని సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముక్తకంఠంతో ఖండించింది. నేటి ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే తొలుత తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాపం తెలిపిన అధికార, విపక్ష సభ్యులు ఆ తర్వాత పెషావర్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పసిపిల్లలని కూడా చూడకుండా ఉగ్రవాదులు తెగబడ్డ దుశ్చర్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. మానవత్వంపై జరిగిన దాడిగానే పెషావర్ దాడిని వారు అభివర్ణించారు. చిన్నారులను ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపేసిన తీరుపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.