: అభిమన్యు బౌన్సర్ తో మనోజ్ తివారీ బేజారు... హెల్మెట్ పగుళ్లిచ్చింది!


బౌన్సర్ తాకి ఆసీస్ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మరణించిన అనంతరం, ఎవరికైనా బౌన్సర్ తగిలితే ఫీల్డింగ్ జట్టు సహా అందరూ ఆందోళన చెందుతున్నారు. మొన్నటి భారత్, ఆసీస్ తొలి టెస్టులోనూ ఈ సన్నివేశం కనిపించింది. కోహ్లీకి బౌన్సర్ తాకగానే ఆసీస్ ఆటగాళ్లంతా అతడి వద్దకు చేరుకుని పరామర్శించారు. తాజాగా, రంజీ ట్రోఫీలోనూ ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. బెంగాల్, కర్ణాటక జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో ప్రస్తుతం లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఫాలో ఆన్ లో పడిన బెంగాల్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో మనోజ్ తివారీ బ్యాటింగ్ కు దిగాడు. వచ్చీ రావడంతోనే ఓ బౌన్సర్ ను రుచిచూశాడు. అభిమన్యు మిథున్ సంధించిన ఆ బౌన్సర్ తివారీ హెల్మెట్ వెనుక భాగాన్ని బలంగా తాకింది. దీంతో, అందరిలోనూ ఆందోళన! తివారీకి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని బౌలర్ అభిమన్యు మిథున్ సహా ఫీల్డింగ్ చేస్తున్న కర్ణాటక ఆటగాళ్లందరూ బ్యాటింగ్ క్రీజు వద్దకు పరుగులు పెట్టారు. ఫిజియో కూడా మైదానంలోకి వచ్చాడు. అదృష్టవశాత్తూ తివారీ హెల్మెట్ ను తాకిందా బౌన్సర్. బంతి వేగానికి ఆ హెల్మెట్ పగుళ్లిచ్చింది. బ్యాట్స్ మన్ కు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, బ్యాటింగ్ కొనసాగించిన ఈ బెంగాల్ స్టార్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం నాలుగు పరుగులు చేసి వినయ్ కుమార్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అవుటైన అనంతరం, హుటాహుటీన ముందు జాగ్రత్త చర్యగా ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఆసుపత్రి బాటపట్టాడు.

  • Loading...

More Telugu News