: రూ.2 కోట్లిస్తేనే తాళి కడతా: పోలీసు అధికారి కూతురుకు వరుడి వేధింపులు
విశాఖపట్నంలో మరో వరకట్న పిశాచి ఉదంతం వెలుగు చూసింది. ఇప్పటిదాకా నమోదైన కేసులన్నీ పెళ్లి అయిన తర్వాత అదనపు కట్నం కోసం వేధించినవి కాగా, నేడు వాల్తేరు పీఎస్ లో నమోదైన కేసులో ఆ కట్న పిశాచి అదనపు కట్నమిస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ కొత్త తరహా వేధింపులకు దిగాడు. దీంతో, రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లి కాస్తా నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే... ఓ పోలీసు ఉన్నతాధికారి కూతురిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్న పర్వేశ్ అనే యువకుడు, నిశ్చితార్థం రోజునే రూ.10 లక్షల మేర తీసుకున్నాడు. నిశ్చితార్థం ముగిసిన నేపథ్యంలో, వధువు కుటుంబం పెళ్లి కార్డులను కూడా బంధువర్గానికి పంపిణీ చేసింది. రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, అదనపు కట్నం కింద రూ.2 కోట్లిస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ పర్వేశ్ వేధింపులు మొదలుపెట్టాడు. అంతేగాక, తనకు అధికార పార్టీ అండదండలున్నాయని కూడా బెదిరించాడు. ఈ నేపథ్యంలో, వధువు కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుని పర్వేశ్ పై వాల్తేరు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పర్వేశ్ పరారయ్యాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేశ్ కోసం గాలింపు చేపట్టారు.