: మహిళల భద్రతకు అసోంలో 'వీరాంగన'లు!
దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీసు దళాలు ఏర్పాటవుతున్నాయి. తాజాగా, అసోంలో 'వీరాంగన' పేరిట ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. గౌహతి నగరంలో మహిళల భద్రతను పరిరక్షించడమే వీరి ప్రధానవిధి. అసోం పోలీసు శాఖలో పనిచేస్తున్న మెరికల్లాంటి మహిళా అధికారులతో ఈ దళాన్ని రూపొందించారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, తీవ్రమైన సంఘటనల్లోనూ నేర్పుగా వ్యవహరించగలిగే రీతిలో వారికి తర్ఫీదునిచ్చామని గౌహతి ఎస్ఎస్పీ ఆనంద్ ప్రకాశ్ తివారీ తెలిపారు. వారు సాధారణ ఆయుధాలతో పాటు మారణాయుధాలను కూడా ఉపయోగించడంలో దిట్టలని వివరించారు. కాగా, ఈ 'వీరాంగన' బృందంలో ఒకరైన కృష్ణ మహంతి అనే అధికారిణి మాట్లాడుతూ, ఘటన మరీ తీవ్రమైనదైతే పురుష అధికారుల సాయం తీసుకుంటామని వివరించారు. 'వీరాంగన' అంటే ధైర్యవంతురాలైన స్త్రీ అని అర్థం.