: మరికొద్ది గంటల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ ను మరికొద్ది గంటల్లో విస్తరించనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం 12 మంది సభ్యులతో కూడిన కేసీఆర్ కేబినెట్ తాజా విస్తరణతో ఈ సంఖ్య 18కి చేరనుంది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టనున్న వారిలో ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, ఆదిలాబాద్ జిల్లా నేత ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన తలసాని శ్రీనివాసయాదవ్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన చందూలాల్ లు ఉన్నారు. ఈ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లాకు రెండు బెర్తులు దక్కనున్నాయి. ఇదిలా ఉంటే, టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు కీలక నేతలు తుమ్మల, తలసానిలకు మంత్రి పదవులు దక్కనుండటం గమనార్హం. మరోవైపు తుమ్మలకు శాఖ కేటాయింపు కూడా ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా తుమ్మలకు అదే శాఖను కేటాయించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొత్తగా కేబినెట్ లో చేరనున్నవారి పేర్లు అధికారికంగా ఖరారు కానప్పటికీ, నగరంలో ఇప్పటికే తలసాని, తుమ్మలకు అభినందనలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో బేనర్లు వెలిశాయి. ఇక ఈ దఫా కూడా కేసీఆర్ కేబినెట్ లో మహిళలకు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. కేబినెట్ లో బెర్తు కోసం వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేత కొండా సురేఖ తీవ్రంగా యత్నించినా, ఫలితం దక్కలేదు. నిన్నటిదాకా సురేఖకూ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని వార్తలు వినిపించినా, అనూహ్యంగా రేసు నుంచి ఆమె పేరు అదృశ్యమైంది.

  • Loading...

More Telugu News