: కేజ్రీవాల్ పై న్యాయపరమైన చర్య తీసుకోండి: జగదీశ్ ముఖీకీ బీజేపీ సూచన
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు నానాటికీ సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ జారీ చేసే ప్రకటనలను ప్రసారం చేసే విషయంలో ముందు తమను సంప్రదించాలని ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు ఢిల్లీ పోలీసులు హుకుం జారీ చేశారు. తాజాగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆప్ ప్రచారం చేస్తున్న జగదీశ్ ముఖీ, కేజ్రీవాల్ పై న్యాయపర చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ పై చర్యలు చేపట్టాలని ఆయనకు బీజేపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే జగదీశ్ ముఖీనే బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం మొదలుపెట్టడమే కాక పోస్టర్లు కూడా తయారు చేయించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధినాయకత్వం కేజ్రీవాల్ పై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.