: ట్విట్టర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ కు బెంగళూరు పోలీసుల సమన్లు
ఐఎస్ ఉగ్రవాది మెహది మసూద్ బిశ్వాస్ అరెస్ట్ నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ కు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసు విషయంలో తామడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడంలో ట్విట్టర్ యాజమాన్యం వ్యవహరించిన తీరు ఏమీ బాగోలేదని, ఈ కారణంగానే ఆ సంస్థ ఇండియా మార్కెటింగ్ హెడ్ ను తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశామని బెంగళూరు డీసీపీ అభిషేక్ గోయల్ చెప్పారు. నేటి సాయంత్రం 5 గంటలకు ట్విట్టర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ తమ ముందు హాజరుకావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. షమి విట్ నెస్ అకౌంట్ కు సంబంధించిన వివరాలివ్వాలని ఐదు రోజుల క్రితం తాము ట్విట్టర్ యాజమాన్యాన్ని అడిగామని, అయితే వారు స్పందించిన తీరు ఏమీ బాగోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమన్న ట్విట్టర్ అధికార ప్రతినిధి, బెంగళూరు పోలీసుల సమన్లపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.