: అలీగఢ్ మత మార్పిడులకు అనుమతి లేదు: యూపీ పోలీసులు
బీజేపీ ఎంపీ ఆదిత్య నాథ్ కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు షాకిచ్చారు. దేశంలో మత మార్పిడుల అంశంపై పెద్ద చర్చ సాగిన నేపథ్యంలో ఈ నెల 25న అలీగఢ్ లో భారీ ఎత్తున మత మార్పిడులను చేపడతామని ధరమ్ జాగరణ్ సమన్వయ్ విభాగ్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తానూ పాలుపంచుకుంటానని ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ కూడా ఆయన సవాల్ చేశారు. అయితే అలీగడ్ లో చేపట్టనున్న మత మార్పిడులకు అనుమతి లేదని తాజాగా యూపీ పోలీసులు తేల్చిచెప్పారు. మత మార్పిడే కాక, ఆ తరహాలో జరిగే ఏ ఇతర కార్యక్రమాన్ని అనుమతించబోమని అలీగఢ్ డీఐజీ మోహిత్ అగర్వాల్ నేడు ప్రకటించారు. అయితే తాము చేపట్టనున్న కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటే, అలీగఢ్ వీధులన్నీ నిరసనలతో పోటెత్తుతాయని భజరంగ్ దళ్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న అలీగఢ్ లో ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు.